డల్లాస్, ఆగస్టు 4 : అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు డల్లాస్‌లో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. బాల్టిమోర్‌లో మూడు రోజులపాటు జరిగిన 'ఆట' మహాసభల్లో పాల్గొన్న అనంతరం ఆయన మంగళవారం డల్లాస్‌కు చేరుకున్నారు.
డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్కకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు.
డల్లాస్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. సింగరేణి అధికారుల బృందంతో కలిసి భట్టి విక్రమార్క 'క్రిటికల్ మినరల్స్' అంశంపై వివిధ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అత్యాధునిక సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎన్ఆర్ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు నెహ్రూ కొమ్మినేని, అచ్యుత్ తుమ్మల, మధు ఇరుగు, వసంత్ బొబ్బల, రాజ్ బెజ్జల, హరినాథ్ శీలం, వడ్డే రాజేష్, ప్రమోద్‌రెడ్డి, రిషిత్ సలవాది, రేవంత్‌రెడ్డి, దుష్యంత్ బొక్క, సందీప్ తదితరులు ఉన్నారు.





















