హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంచిర్యాల జిల్లా వాసి నరెడ్ల సతీశ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో పాటు, ఆయనను స్వదేశానికి తీసుకురావడానికి విమాన టికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సతీశ్ (40) కుటుంబ పోషణ కోసం గత రెండేళ్లుగా యూఏఈలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల జూలై 29న షార్జాలో జరిగిన బైక్ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం పోలీసులు వెంటనే షార్జాలోని అల్ కాస్మియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్ నర్సాపూర్‌లోని బాధితుడి ఇంటికి వెళ్లి, సతీష్ భార్య భవాణి, తండ్రి రామన్నతో కేటీఆర్‌ను ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Loading Tweet...
ఫోన్‌లో కేటీఆర్ – బాధిత కుటుంబ సభ్యుల సంభాషణ
కేటీఆర్: "నమస్తే అమ్మ, నేను కేటీఆర్‌ని."
బాధితుడి భార్య: "సార్.. నమస్తే సార్."
కేటీఆర్: "నమస్తే అమ్మ. నాతో విజిత్ చెప్పిండు, మీ గురించి.. మీకు సమస్య వచ్చింది అని చెప్పిరు. తప్పకుండా వెంటనే పార్టీ నుంచి మొత్తం అన్ని అరేంజ్మెంట్లు చేసి, పేమెంట్ అంతా చేసి తెప్పించేస్తామమ్మా."
కేటీఆర్: "సారీ అమ్మ మీకు.. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి.. తొందర్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తల్లి."
బాధితుడి భార్య: "సార్.. కొంచెం తొందరగా చేయండి సార్.. బాగా ఇబ్బందిగా ఉంది సార్."
కేటీఆర్: "వస్తారమ్మా, వచ్చేస్తారు. మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు, వెంటనే వచ్చేస్తారు. ఆ డబ్బులు ఏమైనా కట్టాల్సింది ఉంటే కట్టేసినాము.. వచ్చేస్తారమ్మా."
బాధితుడి భార్య: "థాంక్యూ.. థాంక్యూ సార్."
కేటీఆర్: "రైట్ అమ్మ.. నమస్తే."
విజిత్: "అన్న ఒక్క నిమిషం.. వాళ్ల ఫాదర్ కూడా ఉన్నారు."
కేటీఆర్: "ఆయనతో మాట్లాడతా."
బాధితుడి తండ్రి: "హలో.. సార్ సార్, నమస్తే సార్."
కేటీఆర్: "నమస్తే అన్న. అది విజిత్ బాబు చెప్పిండు. నేను ఆల్రెడీ దివాకర్ రావు గారికి కూడా చెప్పానన్నా. నేను ఆల్రెడీ అక్కడ చేయాల్సింది అంతా చేసినాము.. వచ్చేస్తారు, వెంటనే వాళ్లని ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేస్తాం. తొందరలోనే వచ్చేస్తారు."
బాధితుడి తండ్రి: "థాంక్యూ అన్న.. థాంక్యూ."
బాధితుడిని వీలైనంత త్వరగా తెలంగాణకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.





















