సిద్దిపేట, అక్టోబర్ 6 (జనవాణి): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు చేపట్టిన తాజా భూసర్వే వివరాలను సీఎం పరిశీలించారు.
రికార్డుల్లో 388.. క్షేత్రస్థాయిలో 343 ఎకరాలే
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 45 ఎకరాల భూమి లెక్క తేలకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని రెవెన్యూ అధికారులను సీఎం ఆదేశించారు.
కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో భూముల సరిహద్దులను కచ్చితంగా గుర్తించేందుకు సర్వే నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే నంబర్ 325కు ఆనుకుని మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వ్యవసాయ భూములు ఉండటంతో వారికి అధికారికంగా నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. తమ వద్ద ఉన్న భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలను సమర్పించాలని నోటీసుల్లో కోరనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత భూములపై స్పష్టత రానుంది.
పేద రైతులకు భూములు.. అమరవీరుల కుటుంబాలకు కాలనీ
సర్వే నంబర్ 325లోని భూమిని సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హులైన స్థానిక పేద రైతులకు భూమిని పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే ప్రాంతంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని సీఎం నిర్ణయించారు. అమరవీరుల కుటుంబాలకు ఇక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని సీఎం సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని డెడ్‌లైన్ విధించారు.



















