హైదరాబాద్, అక్టోబర్ 2 (జనవాణి): జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో జోన్లు, డివిజన్లు, లా అండ్ ఆర్డర్, మహిళా పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ విభాగాల పరిధులను సవరించింది. 2025 డిసెంబర్‌లో నోటిఫై చేసిన పునర్వ్యవస్థీకరణలోని కొన్ని అంశాలను మారుస్తూ హోం శాఖ సెప్టెంబర్ 30న మూడు ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన పోలీసింగ్, పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఉత్తర్వుల్లో ఏ ప్రాంతం ఏ జోన్, డివిజన్, పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే అంశంపై స్పష్టత ఇచ్చింది.
హైదరాబాద్ కమిషనరేట్‌లో మార్పులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా, చిక్కడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా, సంతోష్‌నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా మార్చారు. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్ పోలీస్ స్టేషన్‌గా సవరించారు. రాజేంద్రనగర్, పహాడీషరీఫ్, మీర్‌పేట పోలీస్ స్టేషన్లను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ జోన్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మొత్తాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలోనూ మార్పులు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల పరిధులకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధులను సవరించారు.
పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మార్పులు
బడంగ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేసి, దాని పరిధిలోని ప్రాంతాలను ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో విలీనం చేశారు. మహేశ్వరం ప్రాంతంలోని కొన్ని గ్రామాలను పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురాగా.. శంషాబాద్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో విలీనం చేశారు.
సైబరాబాద్‌లోనూ సవరణలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు కాలనీలు, గ్రామాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధుల్లోకి మార్చారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
మల్కాజిగిరిలో కొత్త జోన్లు, డివిజన్లు
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ లా అండ్ ఆర్డర్ జోన్‌తో పాటు అల్వాల్, ఉప్పల్, మేడిపల్లి లా అండ్ ఆర్డర్ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్‌ను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. మరోవైపు బేగంపేట్ లా అండ్ ఆర్డర్ జోన్‌ను రద్దు చేశారు.
ముఖ్యమైన మార్పులు ఇవే
అల్వాల్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లోని కొన్ని ప్రాంతాలను ఇందులో విలీనం చేశారు.
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లోని మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జన్వాడను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలోని తొర్రూర్, కోహెడ, పెద్దఅంబర్‌పేట్, మంగళ్‌పల్లి గ్రామాలను ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు.
హైదర్‌షాకోట్, గండంగూడ, బైరాగిగూడ, పిరంచెరువు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ, ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ప్రాంతాలను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
తొండుపల్లి, గొల్లపల్లి, పెద్దగోల్కొండ గ్రామాలను శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చారు.
మహిళా పోలీస్ స్టేషన్లు, జోనల్ సైబర్ సెల్స్‌ను జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు.
కుషాయిగూడ, చర్లపల్లి, నాగోల్, తుకారాంగేట్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల అధికార పరిధుల్లోనూ మార్పులు చేశారు.
ఈ మార్పులతో జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీసింగ్ పరిధులను కూడా సర్దుబాటు చేసినట్లయింది. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇకపై తమ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ పరిధిలోకి వస్తుందనే అంశంపై స్పష్టత లభించనుంది.




















