హైదరాబాద్: స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు, యాప్ ఆధారిత డ్రైవర్లకు న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు.
గిగ్ వర్కర్లు రోజంతా కష్టపడుతున్నప్పటికీ వారికి సరైన ఆదాయం రావడం లేదని అన్నారు. మూడేళ్లుగా బేస్ ఫేర్, చార్జీలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు న్యాయమైన పారితోషికం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించాలని సూచించారు.
గిగ్ వర్కర్లు, యాప్ ఆధారిత డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.




















