‘సంధ్యారావు’ పేరుతో ఫేక్ అకౌంట్.. రేవంత్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ‘సంధ్యారావు’ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ పోస్టును ప్రస్తావించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. అసలు బీఆర్‌ఎస్‌లో సంధ్యారావు అనే వ్యక్తి లేరని, ‘అంతర్జాతీయ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి’ అనే పదవే లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఫేక్ అకౌంట్ సృష్టించిందని ఆరోపించిన హరీశ్ రావు.. దీనిపై విచారణ జరిపించాలని, లేకపోతే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

10 సెప్టెంబర్, 2026 1:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘సంధ్యారావు’ పేరుతో ఫేక్ అకౌంట్.. రేవంత్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి చదవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. ‘అంతర్జాతీయ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సంధ్యారావు’ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రస్తావనపై ఆయన స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌లో సంధ్యారావు అనే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. అంతేకాకుండా, అలాంటి పదవి కూడా పార్టీలో లేదని స్పష్టం చేశారు.

సంధ్యారావు పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌ను కాంగ్రెస్ పార్టీనే నిర్వహిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించుకునేందుకు ఫేక్ అకౌంట్‌ను సృష్టించారని విమర్శించారు. ఫేక్ అకౌంట్‌ను సాక్ష్యంగా చూపిస్తూ అసెంబ్లీలో చదవడం శాసనసభను అవమానించడమేనని హరీశ్ రావు అన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారానికి తెరలేపారని ఆరోపించారు. ఫేక్ అకౌంట్ల వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముఖ్యమంత్రి వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో తప్పుడు సమాచారాన్ని ప్రస్తావించడం సరికాదని, దీనిపై తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఏం చెప్పారు?

కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కులం పేరుతో అవమానించారంటూ బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు గతంలో విమర్శలు చేశారు. ఈ అంశంలో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనలు కూడా చేపట్టారు. దళితులు ఫాంహౌస్‌కు వచ్చిన అనంతరం బీఆర్‌ఎస్ నేతలు ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ చర్య జరిగిందని ‘అంతర్జాతీయ బీఆర్‌ఎస్ కార్యదర్శి సంధ్యారావు’ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు రేవంత్ రెడ్డి సభలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలకు ఆధారంగా సంధ్యారావు పేరుతో ఉన్న ఎక్స్ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ జిరాక్స్ కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు. అయితే, ఈ ఖాతా, అందులోని వ్యక్తి, పదవిపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ వేడి రాజుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు