హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు ఇచ్చిన తెలంగాణకు చెందిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 18వ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి, ఆ శాఖ కార్యదర్శికి లేఖ రాసి, వివాదాస్పద ఎజెండా అంశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలోని 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను తొలగించేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా మంజూరు చేసిన అనుమతులను మళ్లీ సమీక్షించే అధికారం జీఆర్ఎంబీకి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రాలజీ, ఇంజినీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అలాంటి నిర్ణయాలను తిరిగి సమీక్షించడం కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే చర్య అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి, ముక్తేశ్వరం, చనాక–కొరట, మోడికుంటవాగు, కడెం–గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ పరిశీలన అనంతరమే కేంద్రం అనుమతులు ఇచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో చేర్చడం సమంజసం కాదన్నారు.
గతంలో జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే అంతర్ బేసిన్‌కు నీటి మళ్లింపు జరగాలనే అంశం స్పష్టంగా నమోదైందని లేఖలో ప్రస్తావించారు.
అదేవిధంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఇప్పటికే హైడ్రాలజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ ఎత్తిపోతల పథకానికి మిగిలిన చట్టబద్ధమైన అనుమతులను కూడా తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన అనుమతులను తిరిగి సమీక్షించే పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చే ప్రతి అనుమతిపైనా అనిశ్చితి నెలకొంటుందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల తెలంగాణ సాగునీటి అభివృద్ధి దెబ్బతినడంతో పాటు కోట్లాది మంది రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణ న్యాయమైన నీటి హక్కులను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, వివాదాస్పద ఎజెండా అంశాలను తొలగించి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను కాపాడాలని హరీశ్‌రావు లేఖలో కోరారు. అలాగే సమ్మక్క సాగర్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులకు కూడా వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.





















