సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను నేరుగా చెప్పే నటుడు నవదీప్.. మరోసారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నవదీప్ అన్నారు. విద్య కోసం కష్టపడిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం బాధాకరమని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం తప్పు కాదని, వారి ఆవేదనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
'ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ?'
భావ ప్రకటన స్వేచ్ఛపై కూడా నవదీప్ సూటిగా ప్రశ్నలు సంధించారు. "ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అంటారు... విద్యార్థులకు మద్దతు ఇస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు... అభిప్రాయం చెబితే నీకేం తెలుసంటారు... చెప్పకపోతే ఎందుకు మాట్లాడలేదని అడుగుతారు. అసలు మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి?" అని ప్రశ్నించారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో భారీ చర్చ
నవదీప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన అడిగిన ప్రశ్నలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయని అభిప్రాయపడుతుండగా.. మరికొందరు వాటిపై భిన్నంగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు మరోసారి భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై చర్చకు దారితీశాయి.
Loading Tweet...




















