హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లు లేనట్టేనా?

హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టే అంశంపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌ల విధానం అమలు సాధ్యం కాదని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ అభిప్రాయపడినట్లు సమాచారం

13 ఆగస్టు, 2026 4:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లు లేనట్టేనా?

హైదరాబాద్, ఆగస్టు 13 (జనవాణి): హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రోజువారీ, నెలవారీ పాస్‌లకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లలో పాస్‌లను ప్రవేశపెట్టడం సాధ్యం కాదని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రెగ్యులర్‌ ప్రయాణికులకు పాస్‌లు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చు తగ్గడంతోపాటు టికెట్‌ తీసుకునే ప్రక్రియ కూడా సులభమవుతుందని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని అధికారులు పలుమార్లు ఎల్‌అండ్‌టీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదు.

సంజయ్‌ జాజు ఆదేశాలతో మళ్లీ తెరపైకి

గత నెలాఖరులో జరిగిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌ బోర్డు సమావేశంలో మెట్రో పాస్‌ల అంశం మరోసారి చర్చకు వచ్చింది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చైర్మన్‌ కె. సంజయ్‌ జాజు రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో అధికారులు చర్చించినట్లు సమాచారం. అయితే గతంలో మాదిరిగానే తాజాగా కూడా పాస్‌ల విషయంలో ఎల్‌అండ్‌టీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని ఇకపై ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై నేటి బోర్డు సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి టికెట్‌పైనా చర్చ

మెట్రో పాస్‌లతో పాటు హైదరాబాద్‌ మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానించే ఉమ్మడి టికెట్‌, పాస్‌ల అంశం కూడా నేటి సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గతవారం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిని అధికారులు సమీక్షించనున్నారు. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే టికెటింగ్‌ వ్యవస్థతో అనుసంధానిస్తే ప్రజా రవాణా మరింత సులభతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోర్డు నిర్ణయం తర్వాత పాస్‌ల విషయంలో తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు