హైదరాబాద్, ఆగస్టు 29 (జనవాణి): నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. కూకట్‌పల్లికి చెందిన శ్రీధర్ అవ్వారి, ఆయన కుటుంబ సభ్యులు దీప్తి, అభినవ్ ఇటీవల మానస సరోవర్ యాత్రకు బయల్దేరారు. వీరు ఈషా ఫౌండేషన్‌కు చెందిన యాత్రికుల బృందంతో కలిసి ప్రయాణించారు. ఈ నెల 26న ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని నేపాల్‌లోకి ప్రవేశించిన అనంతరం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు తమ ప్రయాణ వివరాలను తెలియజేస్తూ వచ్చారు.
అయితే నేపాల్‌లో వరదల తీవ్రత పెరిగిన తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. రెండు రోజులుగా ఫోన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ముగ్గురి ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్లంతైన కుటుంబం ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ముగ్గురినీ సురక్షితంగా గుర్తించి, హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది.




















