హైదరాబాద్, సెప్టెంబర్ 01 (జనవాణి): హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. జైద్ షా ఖాద్రీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నందులాల్ నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నందులాల్ రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న విద్యార్థి జైద్ షా ఖాద్రీ వెంటనే స్పందించాడు. నందులాల్‌ను ఆస్పత్రికి తరలించేందుకు తన వాహనంలోకి ఎక్కించుకున్నాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పటికే తీవ్రంగా గాయపడిన నందులాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. జైద్ షా ఖాద్రీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం మహీంద్రా కారు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నందులాల్‌ను మొదట ఢీకొట్టిన ఇన్నోవా కారును గుర్తించి, అది సందీప్‌కు చెందినదిగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సందీప్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రమాదానికి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నందులాల్‌ను రెండోసారి ఢీకొట్టిన మహీంద్రా కారును కూడా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















