హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్ మెట్రోకు ఉమ్మడి కామన్ పాస్‌ను అక్టోబర్ 2న ప్రారంభించనున్నారు. ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ కామన్ పాస్‌తో నగర పరిధిలో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణికులకు ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధానం ఉపయోగపడనుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో టికెట్ కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గనుంది.
డే, వీక్లీ, మంత్లీ పాస్‌లు
కొత్త విధానంలో డైలీ, వీక్లీ, నెలవారీ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. సమాచారం ప్రకారం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. నగర పరిధిలోని ఆర్టీసీ, మెట్రో సేవలను ఉపయోగించే ప్రయాణికులకు ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ పరిధిలో ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ బస్సులకు ఈ పాస్ వర్తించనుంది. మెట్రో రైళ్లలోనూ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు పాస్ చెల్లుబాటు కానుండటంతో శివారు ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఉపయోగపడనుంది.
మొబైల్ యాప్‌లోనే ఆర్టీసీ పాస్
ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని కూడా టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఆర్టీసీ పాస్ కోసం కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా డే టికెట్, డే పాస్, వీక్లీ పాస్, నెలవారీ పాస్‌లను పొందే విధానం ప్రారంభం కానుంది. ఈ విధానంలో ఫిజికల్ టికెట్ అవసరం లేకుండానే మొబైల్‌లోనే పాస్ పొందవచ్చు. అక్టోబర్ 2 నుంచి ఈ కొత్త వ్యవస్థను ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా
ఆర్టీసీ, మెట్రోకు ఒకే పాస్ అందుబాటులోకి రావడంతో రోజూ ప్రజా రవాణాను వినియోగించే వారికి టికెట్ తీసుకునే ప్రక్రియ మరింత సులభం కానుంది. ఒకే పాస్‌తో రెండు రకాల ప్రజా రవాణా సేవలను వినియోగించే అవకాశం లభించడంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుంది.




















