హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన హోంవర్క్ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి చెందిన కల్మా, సూరా ఫాతిహా చదివి రావాలని హోంవర్క్ ఇవ్వడంతో తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న స్కూల్ యాజమాన్యం సంబంధిత టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించగా.. పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.
సమాచారం ప్రకారం.. హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి డైరీలో "దీనియాత్" సబ్జెక్టు కింద సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ రాశారు. అంతకుముందు కల్మా కూడా చదవాలని సూచించినట్లు, విద్యార్థి ముస్లిం కాదని గుర్తించిన తర్వాత దాన్ని కొట్టివేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని కలిసి.. తమ పిల్లలకు మతపరమైన పాఠాలు ఎందుకు బోధిస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివాదం ముదరడంతో స్పందించిన స్కూల్ యాజమాన్యం.. ఇది టీచర్ చేసిన వ్యక్తిగత పొరపాటు మాత్రమేనని స్పష్టం చేసింది. సంబంధిత ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. తమ పాఠశాలలో "దీనియాత్" బోధన ముస్లిం విద్యార్థులకు మాత్రమే పరిమితమని, ఇతర మతాల విద్యార్థులకు అలాంటి పాఠాలు చెప్పబోమని వివరణ ఇచ్చింది.
ఇక ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా హోంవర్క్ ఇవ్వడం హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి అంశాలపై సెక్యులర్ వాదులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.




















