ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రాలో అద్భుతం.. టోకెన్‌ తీసిన బాలుడి కుటుంబానికే ఫ్లాట్‌

హైదరాబాద్‌ ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపు లక్కీడ్రాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవుపల్లి పరిధిలో ఓ బాలుడు లక్కీడ్రా టోకెన్‌ తీయగా.. అదే టోకెన్‌ అతడి కుటుంబానికి రావడంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. జరపుల లక్ష్మీ కుటుంబానికి సొంతింటి అదృష్టం దక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

28 ఆగస్టు, 2026 8:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రాలో అద్భుతం.. టోకెన్‌ తీసిన బాలుడి కుటుంబానికే ఫ్లాట్‌

AI Image

హైదరాబాద్, ఆగస్టు 28 (జనవాణి): హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు నిర్వహిస్తున్న లక్కీడ్రాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధి లక్ష్మీగూడలో జరిగిన లక్కీడ్రాలో ఓ బాలుడితో టోకెన్‌ తీయించారు. అనూహ్యంగా ఆ టోకెన్‌ అతడి కుటుంబానికే రావడంతో కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

చిన్నారి చేతుల మీదుగా తీసిన టోకెన్‌కే కుటుంబానికి ఫ్లాట్‌ రావడాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చిన్నారుల స్వచ్ఛమైన మనసుతో ఇలాంటి అరుదైన సందర్భాలు చోటుచేసుకోవడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులతో పాటు ప్రభుత్వ సహకారంతో ఆ కుటుంబానికి సొంత ఇల్లు దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు ప్రభుత్వం లక్కీడ్రా ప్రక్రియను కొనసాగిస్తోంది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ ప్రక్రియ చేపడుతున్నారు.

ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు గాను 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేస్తున్నారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలిస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే.. మిగిలిన 120 మందిలో అర్హులకు అవకాశం కల్పిస్తారు. అర్హత ఆధారంగానే, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మించి ఇవ్వనున్నారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి కూడా కల్పించనున్నారు. అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు టవర్లను నిర్మించి, లిఫ్ట్‌లు సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు