గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయా?..లోక్‌సభలో MP కడియం కావ్య ప్రశ్న

PM Jan Dhan Yojana: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అమలుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు.

10 ఆగస్టు, 2026 4:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయా?..లోక్‌సభలో MP కడియం కావ్య ప్రశ్న

Janavaani Image

ఢిల్లీ, ఆగస్టు 10 (జనవాణి): వరంగల్‌ జిల్లాలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PM JDY) కింద ఆర్థిక సేవల పరిస్థితి, జనధన్‌ ఖాతాల సంఖ్య, రూపే కార్డుల జారీ, ఆధార్‌ అనుసంధానం, ఖాతాల నిర్వహణ, డీబీటీ ప్రయోజనాలపై వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహం, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ మౌలిక వసతుల విస్తరణపై కూడా వివరాలు కోరారు.

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వరంగల్‌ జిల్లాలో పీఎంజేడీవై ఖాతాలు 2024 మార్చిలో 2,69,894 ఉండగా.. 2026 మార్చి నాటికి 3,02,317కు పెరిగాయి. ఇదే సమయంలో ఆధార్‌తో అనుసంధానమైన ఖాతాలు 2,18,133 నుంచి 2,65,470కు చేరాయి. రూపే కార్డులు 2,12,030 నుంచి 2,26,409కు పెరిగాయి.

జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య పెరిగినప్పటికీ ఆపరేటివ్‌ ఖాతాల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. 2024 మార్చిలో 2,28,257 ఖాతాలు ఆపరేటివ్‌గా ఉండగా.. 2026 మార్చి నాటికి ఆ సంఖ్య 2,20,607కు తగ్గింది. పీఎంజేడీవై ఖాతాలకు అనుసంధానమైన డీబీటీ పథకాల వివరాలను కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్‌ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, జిల్లాలో జనధన్‌ ఖాతాల సంఖ్య పెరగడం స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ, ఖాతాలు తెరవడమే కాకుండా అవి నిరంతరం వినియోగంలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పేద, అణగారిన వర్గాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా చేరేందుకు బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం చేయాలన్నారు. డిజిటల్‌ చెల్లింపులపై అవగాహనను మరింత విస్తరించి, మహిళలు, రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు సహా ప్రతి వర్గానికి ఆర్థిక అక్షరాస్యత కల్పించాలని పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలో బ్యాంకింగ్‌ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి, ప్రతి అర్హుడికి బ్యాంకింగ్‌ సేవలు, డీబీటీ ప్రయోజనాలు అందేలా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి అని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు