న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనవాణి): హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA) నిధులు మంజూరు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య కోరారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కాకతీయ జూలాజికల్ పార్కులో సింహాల ఎన్‌క్లోజర్, నైట్ షెల్టర్, హైనా, జాకల్, వైల్డ్‌డాగ్ ఎన్‌క్లోజర్లు, నైట్ షెల్టర్లు, సరీసృపాల ఎన్‌క్లోజర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ అటవీ శాఖ ఇప్పటికే కేంద్ర జూ అథారిటీకి సమర్పించిందని ఎంపీ తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరణలు చేసి డిజైన్లు, డ్రాయింగ్‌లు సమర్పించినందున వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
క్యాంపా నిధులతో అభివృద్ధి
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్కులో జంతువుల సంరక్షణతోపాటు మొక్కల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, పార్కు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. క్యాంపా నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జంతువుల కదలికలు, ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ వాటి సంరక్షణ, భద్రతను పర్యవేక్షించేందుకు వీడియో, ఆడియో రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. ఆధునిక పర్యవేక్షణ సదుపాయాలతో జంతువుల సంరక్షణను మరింత సమర్థంగా చేపట్టవచ్చని తెలిపారు.
ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి
కాకతీయ జూలాజికల్ పార్కును వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ విద్య, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తే వరంగల్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని కడియం కావ్య పేర్కొన్నారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.
ఎంపీ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్ సానుకూలంగా స్పందించినట్లు కడియం కావ్య తెలిపారు. కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.





















