కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్..రెండేళ్ల పాటు ఈ మార్గాల్లోనే ప్రయాణించాలి

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. హెచ్‌సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ మార్పులు చేపట్టారు. ఈ విధానం దాదాపు రెండేళ్ల పాటు కొనసాగనుంది.

18 ఆగస్టు, 2026 2:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్..రెండేళ్ల పాటు ఈ మార్గాల్లోనే ప్రయాణించాలి

Social Media Image

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనవాణి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు హెచ్‌సిటీ ప్రాజెక్టు పనులకు అనుగుణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మంగళవారం (2026 ఆగస్టు18) ఉదయం నుంచే కొత్త ట్రాఫిక్ రూట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనదారులకు గందరగోళం లేకుండా పలు ప్రాంతాల్లో రూట్‌ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కూడలి, టర్నింగ్ పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులను, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే గూగుల్ మ్యాప్స్‌, నావిగేషన్ రూట్లలోనూ మార్పులు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు లేన్ మారే సమయంలో రోడ్డు సూచికలను, లేన్ దిశలను జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ నెమ్మదిగా, సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.

ముఖ్యమైన మార్గదర్శకాలు

ఎన్‌ఎఫ్‌సీఎల్‌ (NFCL) నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం మీదుగా వచ్చి ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకోవాలి. అక్కడి నుంచి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా, అగ్రసేన్ ఐలాండ్, అపోలో ఎక్స్ రోడ్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్టుకు చేరుకోవాలి.

యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి రోడ్ నంబర్ 36, 45, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్ ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5 మీదుగా వెంకటగిరి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవాలి. అనంతరం డైమండ్ హౌస్, రోడ్డు నంబర్ 10 మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లాలి.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి జర్నలిస్టు కాలనీ, ఫిలింనగర్‌కు నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఈ వాహనాలు కేబీఆర్ పార్క్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

13 ఎగ్జిట్ పాయింట్లు.. 10 లేన్ చేంజింగ్ పాయింట్లు

వాహనదారులకు సౌకర్యంగా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ 10 లేన్ చేంజింగ్ పాయింట్లు, 13 ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

లేన్ చేంజింగ్ పాయింట్లు:

బంజారాహిల్స్ టీఎస్ స్టడీ సర్కిల్, బీఆర్‌ఎస్ భవన్ యూటర్న్, ఒమేగా ఆసుపత్రి యూటర్న్, మాజీ మంత్రి జానారెడ్డి నివాసం వద్ద యూటర్న్, అపోలో సర్కిల్ యూటర్న్, తాజ్‌మహల్ హోటల్ యూటర్న్, ఫోనిక్స్ బిల్డింగ్ యూటర్న్, రోడ్డు నంబర్ 65 యూటర్న్, మంత్రి టవర్స్ యూటర్న్, క్రీ స్టోన్ యూటర్న్.

ఎగ్జిట్ పాయింట్లు:

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14, నందినగర్, రోడ్డు నంబర్ 10 జహీరానగర్, తెలంగాణ భవన్ వద్ద కొత్త రోడ్డు, అగ్రసేన్ చౌరస్తా రోడ్డు నంబర్ 12, ఒమేగా ఆసుపత్రి-లోటస్ పాండ్, టీటీడీ టెంపుల్ రోడ్డు, బీవీబీ జంక్షన్-ఫిలింనగర్, జర్నలిస్టు కాలనీ-జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 45, రోడ్డు నంబర్ 36-పెద్దమ్మతల్లి దేవాలయం, అన్నపూర్ణ స్టూడియో లేన్, ఎన్టీఆర్ భవన్ రోడ్డు.

ఈ కొత్త వన్‌వే విధానం దాదాపు రెండేళ్ల పాటు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, రోడ్డు నంబర్ 45, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనదారులు నిర్దేశించిన మార్గాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు