హైదరాబాద్, సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ అంశం తాజాగా ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన కొద్దిసేపటికే మంత్రి కొండా సురేఖ కూడా హస్తినకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై పార్టీలోని పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై సొంత పార్టీ నేతల విమర్శలు కూడా పెరిగాయి. మరోవైపు ఈ వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ఏఐసీసీకి నివేదిక సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల మధ్య కొండా సురేఖకు అధిష్టానం నుంచి ఢిల్లీకి పిలుపు వచ్చిందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆమె ఢిల్లీ పర్యటనకు ఖచ్చితమైన కారణాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అదే సమయంలో కొండా సురేఖ హస్తినకు చేరుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.




















