ఢిల్లీ, సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై చర్యలు తీసుకునే మంత్రులపై ఆరోపణలు ఉన్నాయి..వారిపై చర్యల సంగతేంటి? వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తనను ఇప్పటివరకు రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని చెప్పుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నేతలపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
బీసీని అయిన నా విషయంలో ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాల విషయంలో మరో న్యాయం ఎందుకు? అంటూ కొండా సురేఖ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి ఒక విధంగా, ఇతర వర్గాలకు మరో విధంగా వ్యవహరించడం సరికాదని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం.
అలాగే పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్నాయని, వాటికి వారు ఏం సమాధానం చెబుతారని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని సురేఖ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే అధిష్ఠానానికి అన్ని విషయాలను రాతపూర్వకంగా తెలియజేశానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.




















