కొండా సుస్మితపై ఇందిరా శోభన్ ఫైర్.. సీఎంను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?

కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుస్మితకు లేదని విమర్శించారు. తల్లిదండ్రుల పేరును దిగజార్చేలా మాట్లాడకుండా రాజకీయాల్లో ఓపిక, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.

20 ఆగస్టు, 2026 4:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండా సుస్మితపై ఇందిరా శోభన్ ఫైర్.. సీఎంను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?

హైదరాబాద్, ఆగస్టు 20 (జనవాణి): తెలంగాణ రాజకీయాల్లో కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సుస్మితా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం నాయకత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందా?

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కొండా సుస్మితకు ఉందా? అని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓపిక, బాధ్యత అవసరమని.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో పనిచేయవని వ్యాఖ్యానించారు. పిల్లలు తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా వ్యవహరించాలని సూచించిన ఇందిరా శోభన్.. సుస్మిత వ్యాఖ్యల కారణంగా ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని అన్నారు. కానీ నీ (Susmita Patel) వల్ల సురేఖ అక్క ఇబ్బంది ఎదుర్కొంటూ, క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. ఇలాంటప్పుడు నువ్వు తల్లికి తగ్గ బిడ్డవు ఎలా అవుతావు... మా అక్క బిడ్డ అని చాలా పద్దతిగా మాట్లాడుతున్నాం. వేరే వాళ్లు అయితే మా భాష మరోలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం... కుటుంబ సభ్యులను గౌరవించి మాట్లాడుతున్నాం అని ఇందిరా శోభన్ తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పార్టీ కోసం ఏం చేశారు?

కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీలో ఏదైనా బాధ్యత తీసుకున్నారా? ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పనిచేశారా? అని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. పదవులు, ఎమ్మెల్యే టికెట్ల కోసం మాట్లాడటం కంటే ముందుగా రాజకీయాల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. మీ ఇంట్లో వాళ్లకు పదవులు కావాలని అడగటం తప్ప, ప్రజలకు ఏం చేశారు?. రాజకీయాల్లో ఓపిక లేకపోతే ఎలా?, నోటికి ఏది వస్తే అది మాట్లాడి ‘నేను ఎవరికి భయపడను’ అంటే ఎలా?... ‘నేను పెద్ద హీరోయిన్‌ను’ అంటే ఎలా?... సినిమా డైలాగ్‌లు ప్రజా క్షేత్రం పనిచేయవు. ఆవేశపడకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఎలా ఉండాలో ముందు నేర్చుకో. అమ్మ పేరు చెప్పుకుని ముఖ్యమంత్రిని తిట్టడమేనా పని. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం పరిస్థితులకు అనుగుణంగా ఎమ్మెల్యే టికెట్లను నిర్ణయిస్తుందని తెలిపారు. టికెట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నాయకులు కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారని అన్నారు.

‘ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇచ్చేలా మాట్లాడొద్దు’

సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి అస్త్రాలుగా మారుతున్నాయని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేయాలని సూచించారు. కొండా సుస్మితకు అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని ఇందిరా శోభన్ సూచించారు. ఆరోపణలు చేయడం కంటే ఆధారాలతో మాట్లాడాలని అన్నారు.

‘ముందుగా క్షమాపణ చెప్పాలి’

కొండా సుస్మిత తన వ్యాఖ్యలకు ముందుగా క్షమాపణ చెప్పాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. గతంలో జరిగిన వివాదాల నుంచి పార్టీ, కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని.. మళ్లీ అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కొండా కుటుంబం గతంలో ఇతర పార్టీల్లోకి వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఇందిరా శోభన్.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధానానికి అనుగుణంగానే మాట్లాడాలని సూచించారు.

‘రాజకీయాల్లో మాట్లాడే ముందు ఆలోచించాలి’

‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న చందంగా వ్యవహరించవద్దని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. ఆవేశంతో మాట్లాడటం సులభమే కానీ, ఆ వ్యాఖ్యల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు పార్టీలో లేదా ప్రభుత్వంలో పదవులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

కొండా సుస్మిత వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయనే అనుమానం కలుగుతోందని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల కారణంగా మంత్రి కొండా సురేఖ మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని అన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు