హైదరాబాద్, ఆగస్టు11(జనవాణి): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం నడుపుతున్నది ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాలు, భూముల కేటాయింపులపై పలు ప్రశ్నలు సంధించారు.
టెసరాక్ట్‌పై కేటీఆర్ ఆరోపణలు
కొండల్ రెడ్డి ఏం చదువుకున్నాడో, ఏమో నాకు తెలియదు కానీ...కొండల్ రెడ్డి టెసరాక్ట్ సంస్థకు తానే ఛైర్మన్ అని తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. అమెరికా కాన్సుల్ జనరల్ టెసరాక్ట్ సంస్థ కార్యక్రమానికి హాజరయ్యారని, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ కార్యక్రమంలోనూ కొండల్ రెడ్డి టెసరాక్ట్ ఛైర్మన్ హోదాలో పాల్గొన్నారని పేర్కొన్నారు. టెసరాక్ట్ కంపెనీ వెబ్‌సైట్ చూశాం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని ఉంది.. ఇలాంటి నంబర్లు ఉండొచ్చని మాకు తెలీదు, రేవంత్ రెడ్డి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా కనుగొన్నాడో అది కూడా తెలియదు. కేవలం లక్ష రూపాయల పెయిడప్ క్యాపిటల్ ఉన్న టెసరాక్ట్ కంపెనీకి, ఒక్క ఉద్యోగి కూడా లేరని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించిందని, ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం ఉందా? అని ప్రశ్నించారు. చదువురాని లేని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కోట్లు, సూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలకు ఛైర్మన్లు ఎలా అయిపోతున్నారు? అని అడిగారు.
ఇతర కుటుంబ సభ్యులపైనా ఆరోపణలు
రేవంత్ రెడ్డి మరో సోదరుడు జగదీష్ రెడ్డితో కలిసి ‘స్వచ్ఛ్ బయో’ సంస్థ పేరుతో అమెరికాలో రూ.1,000 కోట్ల ఎంవోయూ చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జగదీష్ రెడ్డికి కూడా ఎక్కడ భూమి కేటాయించారో వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం బావమరిది సృజన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్నట్లు తాను పేర్కొన్న అక్రమాల్లోనూ సృజన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి మరో సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారిక పదవి లేకపోయినా కొడంగల్‌లో కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం అల్లుడి కోసం, ఆయన భాగస్వామిగా ఉన్న కంపెనీ కోసం లగచర్లలో గిరిజనుల భూములను లాక్కున్నారని కూడా ఆరోపించారు.
Loading Tweet...




















