హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సైఫాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గేట్ నెం.3 వద్ద మహిళా కానిస్టేబుళ్లు భద్రతా విధుల్లో ఉన్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు రాజకీయ నినాదాలతో కూడిన నల్ల టీ-షర్టులు ధరించి, ప్లకార్డులతో అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి దుస్తులు, ప్లకార్డులకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తమను దుర్భాషలాడారని ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు అవమానకర రీతిలో మాట్లాడారని ఆమె ఆరోపించారు.
హరీశ్‌రావు తన టీ-షర్టును విప్పి ఓ పోలీసు అధికారిపైకి విసిరారని, మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తమతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















