నల్లగొండ, ఆగస్టు 31 (జనవాణి): నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అనంతరం మంత్రి దిష్టిబొమ్మతో పాటు అక్కడే ఉన్న కోమటిరెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు నల్లగొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపైనా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. అనంతరం ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు బీజేపీ కార్యాలయ గేట్లకు నల్లరంగు పూశారు. దీనికి ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు మరోసారి దాడికి దిగినట్లు సమాచారం.
Loading Tweet...




















