PhonePe లో కొత్త సేవలు.. రోజుకు రూ.100తో RD, యాప్‌లోనే FD పెట్టుబడులు!

చాలా మంది పెట్టుబడులు పెట్టాలని భావించినప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, ఏ పథకం సురక్షితం అనే సందేహాలతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే వినియోగదారుల కోసం కొత్తగా డైలీ రికరింగ్ డిపాజిట్ (RD), డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలను ప్రారంభించింది.

7 ఆగస్టు, 2026 12:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

PhonePe లో కొత్త సేవలు.. రోజుకు రూ.100తో RD, యాప్‌లోనే FD పెట్టుబడులు!

Social Media Image

డిజిటల్ పేమెంట్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే (PhonePe) తన కస్టమర్ల కోసం మరో కీలక ఆర్థిక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ చెల్లింపులు, బిల్ పేమెంట్స్, రీఛార్జ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇప్పుడు డైలీ రికరింగ్ డిపాజిట్ (Daily RD), డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలను లాంఛ్ చేసింది. దీంతో చిన్న మొత్తాలతో పొదుపు చేయాలనుకునే వారికి ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడనున్నాయి.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన డైలీ RD ద్వారా వినియోగదారులు రోజుకు కేవలం రూ.100తోనే పొదుపు ప్రారంభించవచ్చు. రోజుకు కనిష్టంగా రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.1,000 వరకు జమ చేసే అవకాశం ఉంది. UPI AutoPay సదుపాయం ద్వారా ప్రతిరోజూ డబ్బు ఆటోమేటిక్‌గా జమయ్యేలా సెటప్ చేసుకోవచ్చు. దీంతో ప్రతి రోజుగుర్తుంచుకొని డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏం ఉండదు.

ఈ డైలీ RD సేవను శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫోన్‌పే అందిస్తోంది. చిన్న మొత్తాలతో పొదుపు చేయాలనుకునే ఉద్యోగులు, యువత, మహిళలు, అలాగే బ్యాంకింగ్ సేవలను తక్కువగా వినియోగించే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ తెలిపింది.

అలాగే ఫోన్‌పే యాప్‌లోనే డిజిటల్ FD సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు వివిధ భాగస్వామ్య బ్యాంకులు, NBFC సంస్థల FD వడ్డీ రేట్లను ఒకే ప్లాట్‌ఫాంలో పోల్చి, తమకు అనుకూలమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటికే చేసిన ఎఫ్‌డీలను కూడా ఒకే యాప్‌లో నిర్వహించే సౌకర్యం కల్పించింది.

ఫోన్‌పే తెలిపిన వివరాల ప్రకారం, భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన FDలకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నిబంధనల మేరకు రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా రక్షణ ఉంటుంది. దీంతో వినియోగదారులకు పెట్టుబడులపై అదనపు భద్రత లభించనుంది.

ఫోన్‌పే యాప్‌లో RD, FD ఎలా ప్రారంభించాలి?

మీరు ఫోన్‌పే యాప్‌లో డైలీ RD లేదా డిజిటల్ FD ప్రారంభించడం చాలా సులభం. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.

  • ముందుగా PhonePe యాప్ ఓపెన్ చేసి, Mutual Funds & Deposits విభాగంలోకి వెళ్లాలి.

  • అక్కడ Daily RD లేదా Fixed Deposit (FD) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • అనంతరం భాగస్వామ్య బ్యాంకును సెలెక్ట్ చేసి, డిపాజిట్ కాలవ్యవధి (7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు)తో పాటు పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

  • తర్వాత పాన్, ఆధార్ ఆధారంగా డిజిటల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, నామినీ వివరాలను నమోదు చేయాలి.

  • చివరగా UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేస్తే డిపాజిట్ ప్రారంభమవుతుంది. డైలీ RD కోసం UPI AutoPayకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

ముందస్తు ఉపసంహరణకు అవకాశం

అవసరమైతే వినియోగదారులు తమ FD లేదా RD మొత్తాన్ని ముందుగానే ఉపసంహరించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో డబ్బును సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ సౌకర్యం పెట్టుబడిదారులకు మరింత వెసులుబాటు కల్పిస్తుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివిధ కాలపరిమితులపై 6% నుంచి 8% వరకు, సీనియర్ సిటిజన్లకు 6.50% నుంచి 8.50% వరకు వడ్డీ అందిస్తోంది. ముఖ్యంగా 24 నుండి 27 నెలల డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు