హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలు వసూలు చేస్తారన్న ప్రచారంతో ఆందోళన చెందుతున్న వినియోగదారులకు ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ భరోసా ఇచ్చారు. భారతీయ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా డబ్బులు పంపేందుకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
సమీర్ నిగమ్ శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. యూపీఐ ఎప్పటికీ భారతీయ వినియోగదారులకు ఉచితంగానే ఉంటుందని పేర్కొన్నారు. ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్–2007’లో మార్పులకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై చర్చ మొదలైంది.
అసలు చర్చ ఎందుకంటే..
కొత్త నిబంధనలు ఎంపిక చేసిన డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం కల్పిస్తాయన్న చర్చ జరుగుతోంది. అయితే దీనర్థం ప్రతి యూపీఐ వినియోగదారుడి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారని కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత MDR ప్రధానంగా కొన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించినదిగా చర్చ జరుగుతోంది.
చిన్న వ్యాపారులపైనా భారం ఉండదు
పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కూడా వినియోగదారులకు యూపీఐ సేవలు ఇప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించేందుకు MDR చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. వ్యాపారులకు వర్తించే మర్చంట్ సర్వీస్ ఛార్జీలు ఉంటే అవి వ్యాపార సంస్థలు, చెల్లింపుల సేవా సంస్థల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినవేనని PCI వివరించింది. వినియోగదారులు యూపీఐ ఉపయోగించేందుకు చెల్లించే రుసుములు కావని స్పష్టం చేసింది.
రూ.2 వేలపైనే ఎందుకీ చర్చ?
ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదన ప్రకారం రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార సంబంధిత యూపీఐ లావాదేవీలపై MDR విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే సాధారణ యూపీఐ బదిలీలపై ఇది వర్తించదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత MDR రేటు 0.25–0.4 శాతం పరిధిలో ఉండవచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ తుది విధానం ఇంకా ఖరారు కాలేదు.
యూపీఐ నిర్వహణ ఖర్చు ఎవరు భరించాలి?
యూపీఐ మౌలిక వసతుల నిర్వహణ, సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక అభివృద్ధి, కస్టమర్ సేవలకు నిరంతరం వ్యయం అవుతుందని PCI పేర్కొంది. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలం బలోపేతం చేసేందుకు స్థిరమైన ఆదాయ నమూనా అవసరమనే చర్చ కూడా కొనసాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా యూపీఐ మౌలిక వసతుల నిర్వహణకు అయ్యే ఖర్చును ఎవరైనా భరించాల్సిందేనని ఇటీవల పేర్కొన్నారు. అయితే MDR నిర్మాణంపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు అవుతుందని, డిజిటల్ చెల్లింపులు అందుబాటులో, చౌకగా, సురక్షితంగా ఉండేలా చూడటమే లక్ష్యమని తెలిపారు.
భారీగా పెరుగుతున్న యూపీఐ వినియోగం
దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. జూలైలో యూపీఐ ద్వారా 2,365 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ సుమారు రూ.29.87 లక్షల కోట్లు. గత ఏడాది జూలైలో నమోదైన 2,000 కోట్ల లావాదేవీలతో పోలిస్తే వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూపీఐపై ఏదైనా ఛార్జీ విధించే అంశం కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆసక్తి, ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతానికి సాధారణ వినియోగదారులు యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.




















