హైదరాబాద్, ఆగస్టు 11 (జనవాణి): నిషేధిత ఆస్తుల పీఓబీ/22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన వారి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
22ఎ/పీఓబీ అంశంపై మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజావాణితోపాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ నెల 14లోగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ అనుమతులు తదితర అన్ని డాక్యుమెంట్లను ఆగస్టు 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టడంతోపాటు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని తెలిపారు. ఏది నిజమైన పత్రం, ఏది బోగస్ అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరింత పారదర్శకత కోసం పహాణీలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అర్హులైన దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి
వచ్చిన దరఖాస్తుల్లో ఏవి నిజమైనవి, ఏవి కాదో గుర్తించి.. అర్హత ఉన్న వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ‘‘సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కంటే.. సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది’’ అని పేర్కొన్నారు. పీఓబీ దరఖాస్తులను కేసుల వారీగా ప్రతిరోజూ సమీక్షించాలని ఆదేశించారు. 22ఎ పేరుతో ఉద్దేశపూర్వకంగా పేదలు, అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్
సబ్ రిజిస్ట్రార్లకు అదనపు విచక్షణాధికారాలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేలా వారి అధికారాలను పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. చిన్న తప్పిదం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కలెక్టర్ లేదా ఐజీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పీఓబీ రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు
పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించవద్దని పొంగులేటి సూచించారు. రిజిస్ట్రేషన్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వస్తుందో కారణాలను పరిశీలించేందుకు మూడు రోజుల సమయం తీసుకుని, స్పష్టమైన వివరాలతో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. పీఓబీకి సంబంధించి వచ్చే ప్రతి దరఖాస్తును ఇకపై తహసీల్దార్‌కు పంపకుండా నేరుగా కలెక్టర్‌కు పంపాలని సూచించారు. కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ మధ్యే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమీకృత జాబితాలతో సమస్యలకు చెక్
గతంలో నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వాటిని సమీకృతం చేయడంతో కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తుండటంతో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతోందని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాజాగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న సమాచారంతో పాత వివరాలను సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నేడు సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం
నాలుగు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో మంగళవారం సాయంత్రంలోగా సమావేశం నిర్వహించి, ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించాలని మంత్రి ఆదేశించారు. నిర్ణయాలను తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డి.ఎస్. లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంత్, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.





















