హైదరాబాద్, ఆగస్టు 19 (జనవాణి): బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు, ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకోవడమే తాజా పరిణామాలకు కారణమని ఆయన విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్క నేతకు కూడా స్థానం దక్కలేదు. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈసారి చోటు లభించలేదు. వారి పదవులు కూడా పునరుద్ధరణ కాలేదు.
మరోవైపు 2028లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ‘మిషన్ తెలంగాణ’ పేరుతో బీజేపీ అధిష్ఠానం ముందుకు సాగుతోంది. అయితే కీలకమైన జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ.. తెలంగాణ బీజేపీలో నేతలు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని, తరచూ ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యం తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పద్ధతిని మార్చుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.
Loading Tweet...




















