కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను సభలో వెల్లడించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

16 సెప్టెంబర్, 2026 4:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక

హైదరాబాద్,సెప్టెంబర్ 16 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకుని భూముల విషయంలో దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.

కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 440 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబంలోని నలుగురి పేర్లపై 123 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో కేటీఆర్ పేరుపై 49.5 ఎకరాలు, శైలిమ పేరుపై 17.5 ఎకరాలు, అలేఖ్య పేరుపై 9.38 ఎకరాలు, హిమాన్షు పేరుపై 46.3 ఎకరాలు ఉన్నట్లు వివరించారు.

అలాగే హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు, సంతోషరావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్ రావు పేరుపై 52 ఎకరాలు, కొండల్ రావు పేరుపై 48 ఎకరాల భూమి ఉన్నట్లు సీఎం సభలో పేర్కొన్నారు.

కేసీఆర్ ఫాంహౌస్‌పై 30 రోజుల్లో విచారణ

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు ఇచ్చి భూములపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విచారణలో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 రోజుల్లో విచారణ నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో సుమారు 700 ఎకరాల భూమి ఉందని పేర్కొన్న సీఎం.. ఆ భూముల వివరాలను తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణ అనంతరం భూములు ప్రభుత్వ పరిధిలోకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు, ముఖ్యంగా ఎస్సీలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రేవంత్ ప్రకటించారు. ఏ భూమినైతే శుద్ధి చేశారో అదే భూమికి ఎస్సీలను యజమానులుగా చేస్తామని తెలిపారు.

కేటీఆర్, హరీశ్ రావు ఫాంహౌస్‌లపైనా ఆరోపణలు

కేటీఆర్ ఫాంహౌస్ కూడా సత్యం స్కాంలో ఉన్న భూముల్లోనే ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సత్యం స్కాంలో ఉన్న భూములు కేటీఆర్ బంధువుల పేర్లకు బదిలీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. హరీశ్ రావు ఫాంహౌస్‌కు సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో రోడ్లు వేయించారని సీఎం ఆరోపించారు. ఇరిగేషన్ అవసరాల కోసం తీసుకున్న భూమిలోనే హరీశ్ రావు ఫాంహౌస్ ఉందని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ బాలానగర్‌లో 120 ఎకరాల భూమిని హరీశ్ రావు కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులు భయపడుతున్నారని ఆయన సభలో పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు