హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనవాణి): స్పీకర్‌ను దూషించిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌పై జరిగిన మాటల దాడిని సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు.
ఈ ఘటన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా స్పీకర్‌తో మాట్లాడి క్షమాపణలు చెబుతారని ప్రజాస్వామ్యవాదులు భావించారని సీఎం అన్నారు. అయితే కేసీఆర్ అలా చేయలేదని విమర్శించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలు సభలో చర్చకు వస్తే తమ పార్టీ గుట్టు రట్టవుతుందనే భయంతోనే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సభ్యులను ఉసిగొలిపి అసెంబ్లీకి పంపించారని మండిపడ్డారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే కుట్రకు రూపకల్పన జరిగిందని ఆరోపించిన సీఎం.. అదే ఫామ్‌హౌస్‌కు వెళ్లి డప్పులు వాయించేందుకు ప్రయత్నించిన సందర్భాన్ని ప్రస్తావించారు. అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే నిరసనలో పాల్గొన్న మైదానాన్ని శ్రీరామసేన శుద్ధీకరణ చేసిన ఘటనను కూడా రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. స్పీకర్ స్థానాన్ని అవమానించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని సీఎం స్పష్టం చేశారు. సభలో సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు.




















