హైదరాబాద్, ఆగస్టు 24 (జనవాణి): బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై స్పందిస్తూ.. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. “ఇది నాకు జరిగిన అవమానం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం” అని సీఎం వ్యాఖ్యానించారు. తన అమెరికా పర్యటనను రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. తనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలు, విదేశీ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడం కోసం అమెరికా పర్యటన కీలకమైందన్నారు. అమెరికా పర్యటనకు తాను వెళ్లలేకపోయినా.. అధికారులు ఇప్పటికే అమెరికా వెళ్లారని, వారి ద్వారా పెట్టుబడులు, విద్యా సంస్థలతో సంబంధాల విషయంలో లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు” అని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాలు, శిక్షణ అవకాశాలు కల్పించడం తన అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా వివక్షకు నిదర్శనమని అన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. కాంగ్రెస్ సీఎంగా ఉన్నందుకే తన పర్యటనను అడ్డుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని, ముఖ్యంగా మెట్రో వంటి కీలక అంశాల్లోనూ కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తోందా? అని సీఎం ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రధాని మోదీకి అవసరం లేదా? అని నిలదీశారు.
నాది చాటుమాటు పర్యటన కాదు.. అధికారిక పర్యటన
తన విదేశీ పర్యటనను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “నాది చాటుమాటు పర్యటన కాదు.. అధికారిక పర్యటన” అని స్పష్టం చేశారు. తన పర్యటనను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి కోసం తమ లక్ష్యాలను అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తున్నారని, దేశ ప్రధానిగా వ్యవహరించడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గుజరాత్‌కు చెందిన నేతలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు మద్దతు ఇస్తున్నారా? తెలంగాణ అభివృద్ధి వారికి అవసరం లేదా? అని సీఎం ప్రశ్నించారు. తన పర్యటనను అడ్డుకోవడం తెలంగాణపై వివక్ష చూపించడమేనని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న సమయంలోనే కేంద్రం వైఖరిపై స్పందించి ఉంటే తనను దేశద్రోహిగా చిత్రీకరించేవారని రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే భారత్‌కు తిరిగి వచ్చి కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మాట్లాడుతున్నానని తెలిపారు. ఏ విదేశీ పర్యటన అయినా భారత ఎంబసీ పర్యవేక్షణలోనే జరుగుతుందని సీఎం వివరించారు. పర్యటనకు సంబంధించిన వివరాలను భారత ఎంబసీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుందని, అలాంటప్పుడు తన పర్యటనలో రహస్యం ఏముందని ప్రశ్నించారు.
కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు
తెలంగాణ బీజేపీ నేతలు తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి ప్రభుత్వం, తన అధికారిక పర్యటనలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై తాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేయదలచుకోలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎందుకంటే వారికి ఆ స్థాయి లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా గతంలోనూ తాను విదేశీ పర్యటనలు చేపట్టినట్లు సీఎం వివరించారు. ప్రభుత్వ ప్రయోజనాల కోసం అధికారికంగా చేపట్టే పర్యటనలను రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ఢిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన అధికారిక విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్రానికి అవాస్తవాలు చెప్పి అనవసరమైన అనుమానాలు సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలను అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధికి నష్టం కలిగించడమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం తనకు అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల లండన్ పర్యటనను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసుకున్న సీఎం సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎంను కలిశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌లోని తాజా పరిణామాలపైనా సీఎం పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




















