హైదరాబాద్, ఆగస్టు 15 (జనవాణి): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
నవ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యం నింపి.. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని ఆకాంక్షించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ.. పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందించాలని అన్నారు.
అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన బలమైన ప్రజాస్వామ్య భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ శుభసందర్భంగా పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అందేలా సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ.. భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన భారతదేశాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరాలి: కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించిందని గుర్తుచేశారు.
నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించాయని కేసీఆర్ పేర్కొన్నారు.
79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిపై ప్రతి ఒక్కరూ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.
ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాలని సూచించారు.
భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అప్పుడే స్వాతంత్ర్యోద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని స్పష్టం చేశారు.





















