హైదరాబాద్, ఆగస్టు 29 (జనవాణి): తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
73.39 లక్షల ఎంట్రీలపై ఆందోళన
తెలంగాణలో సుమారు 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 73.39 లక్షల ఎంట్రీలను బూత్ లెవల్ అధికారులు (BLO) ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో చేర్చినట్లు సీఎం లేఖలో పేర్కొన్నారు. వీరిలో 45.19 లక్షల మంది, అంటే దాదాపు 62 శాతం మందిని శాశ్వతంగా తరలివెళ్లినవారుగా గుర్తించడం ఆందోళనకరమని తెలిపారు.
క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు
BLOలు ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ఓటరు ఉద్యోగం, పని లేదా ఇతర కారణాలతో బయట ఉన్నా.. వారిని శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు పరిగణిస్తున్న ఘటనలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇల్లు మారిన ఓటర్లను పాత చిరునామా నుంచి తొలగించే ముందు కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి నోటీసులు అధికంగా ఉన్నాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రేవంత్ ప్రధాన డిమాండ్లు
గడువు పొడిగింపు: సెప్టెంబర్ 16తో ముగిసే క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలి.
నోటీసులకు అదనపు సమయం: ఓటర్లకు స్పందించేందుకు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఇచ్చే వారం రోజుల గడువును 3-4 వారాలకు పెంచాలి.
హెల్ప్‌డెస్క్‌లు: నోటీసులు అందుకున్న ఓటర్లకు సహాయం చేసేందుకు బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
ముసాయిదా జాబితా బహిరంగ పఠనం: గ్రామ సభలు, పట్టణ వార్డు కమిటీ సమావేశాల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజలకు చదివి వినిపించాలి.
డాక్యుమెంట్లలో సడలింపు: ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌కు ప్రత్యామ్నాయంగా స్థానికంగా సులభంగా లభించే ధృవీకరణ పత్రాలను అనుమతించాలి.
అదనపు EROలు: పెండింగ్‌లో ఉన్న నోటీసుల విచారణను వేగవంతం చేసేందుకు అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించాలి.
అర్హుడైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకూడదన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘానికి అవసరమైన అన్ని రకాల పరిపాలనా, నిర్వహణ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.























