హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): తెలంగాణ అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వారసత్వ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ వారసత్వ సంపదను కాపాడటంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనం, హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఫౌండేషన్ మరింత భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్య, పర్యాటకం, వైద్య రంగాల్లో కలిసి పనిచేయాలని కోరారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై చర్చ
హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని అభివృద్ధి చేసే ప్రణాళికలను వెల్లడించారు. మూసీ వెంట ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని సీఎం కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలన్న ఆలోచన ఉందని వివరించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌కు ఆహ్వానం
డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను సీఎం ఆహ్వానించారు. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని తెలిపారు.
ఫ్యూచర్ సిటీపై ఆసక్తి
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్-V ఆసక్తి కనబరచగా.. సీఎం రేవంత్ రెడ్డి దాని ప్రణాళికలను వివరించారు. సుమారు 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో దీనిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని పూర్తిగా నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం వివరించారు. సింగపూర్‌కు చెందిన సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, దాదాపు 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి
ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు సమావేశంలో వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా పలు అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు, ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.




















