హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను సాధ్యమైనంత మేర వినియోగించుకుని సాగుకు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
దేవాదుల ప్రాజెక్టు నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల్లో ఎదురవుతున్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. పెండింగ్ పరిహారాన్ని వెంటనే చెల్లించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులపై నివేదిక రూపొందించాలని సూచించారు.
తక్షణ ప్రభావం పడే గ్రామాలకు ముందుగా పరిహారం చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీటిని నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పునరావాసం, పరిహారం అంశాలను ప్రాధాన్యంతో పరిష్కరించాలని సూచించారు.
గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. ప్రాజెక్టు సామర్థ్యం, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి నిల్వ విషయంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం స్పష్టం చేశారు. NDSA సూచనల మేరకే ఆయా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని సమావేశంలో అధికారులు వివరించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
బ్యారేజీల భద్రతకు సంబంధించిన అంశాలపై NDSAతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు, పరిహారం, పునరావాసం, ఎత్తిపోతల సామర్థ్యం, బ్యారేజీల భద్రత వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.





















