భారత బ్యాడ్మింటన్‌లో యువ సంచలనం తన్వీ శర్మ మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే తైపీ ఓపెన్ సూపర్-300 మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నానికి చెందిన ఆరో సీడ్ నుయెన్ తుయ్ లిన్‌ను 21-16, 21-16తో వరుస గేముల్లో ఓడించి తన కెరీర్‌లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను అందుకుంది. ఈ విజయంతో 2008లో సైనా నెహ్వాల్ తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్రలో నిలిచింది.
తొలి నుంచే దూకుడు
ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే తన్వీ తనదైన దూకుడును ప్రదర్శించింది. డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్ట్ స్మాష్‌లతో ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. తొలి గేమ్‌లో 10-2 ఆధిక్యంలోకి వెళ్లిన తన్వీ.. మధ్యలో కొన్ని తప్పిదాలు చేసినా వెంటనే కోలుకుని 21-16తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో నుయెన్ 3-0తో ముందంజ వేసినా తన్వీ ఏమాత్రం తడబడలేదు. వరుస ర్యాలీల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ స్కోరును సమం చేసింది. నెట్ వద్ద అద్భుతమైన టచ్, స్మాష్‌లతో వరుస పాయింట్లు సాధిస్తూ 18-12తో మ్యాచ్‌ను దాదాపు ఖాయం చేసింది. చివర్లో మూడు మ్యాచ్ పాయింట్లు వృథా చేసుకున్నప్పటికీ నాలుగో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టైటిల్‌ను ముద్దాడింది.
కోచ్‌కు అంకితం
విజయం అనంతరం తన్వీ చేసిన పని అందరి మనసులు గెలుచుకుంది. మెడలో వేసుకున్న స్వర్ణ పతకాన్ని తీసి తన కోచ్ పార్క్ టే-సాంగ్ మెడలో వేసి తన విజయాన్ని ఆయనకు అంకితం చేసింది. పీవీ సింధుకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ అందించిన పార్క్.. ఇప్పుడు తన్వీ కెరీర్‌కు కూడా బలమైన పునాదులు వేస్తున్నారు.
రికార్డులపై రికార్డులు
17 సంవత్సరాలు 222 రోజుల వయసులో తైపీ ఓపెన్ టైటిల్ నెగ్గిన అత్యంత పిన్న వయస్కురాలిగా తన్వీ కొత్త రికార్డు సృష్టించింది. 2006లో లీ యోంగ్ డే పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగానూ, ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన జట్టులో సభ్యురాలిగానూ ఇప్పటికే తన్వీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్-300లో రన్నరప్‌గా నిలిచిన తన్వీ.. ఇప్పుడు తైపీ ఓపెన్ టైటిల్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో చూపిస్తున్న నిలకడైన ప్రదర్శనతో భారత బ్యాడ్మింటన్‌లో ఆమెపై అంచనాలు మరింత పెరిగాయి.





















