భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారీ దూకుడు ప్రదర్శించాడు. జింబాబ్వే పర్యటలో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా 230 స్థానాలు ఎగబాకాడు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 48వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది.
జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు అర్ధ సంచరీలతో మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి భారత జట్టు 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన ఫలితంగా ఐసీసీ 20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు.
టీ 20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 910 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. జింబాబ్వే సిరీస్ అనంతరం కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ.. రెండో స్థానంలో ఉన్న సాహిద్‌జాదా ఫర్హాన్ (848)పై ఇషాన్ కిషన్ గణనీయమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. కెరీర్‌లో ఒక దశలో 916 రేటింగ్ పాయింట్లు సాధించిన ఇషాన్.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (909), సూర్యకుమార్ యాదవ్ (912) లను అధిగమించడం విశేషం.
శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నంబర్‌వన్ స్థానం
వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి మిచెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల వెస్టిండీస్-న్యూజిలాండ్ సిరీస్ అనంతరం జరిగిన మార్పులతో గిల్ తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
తిలక్, శ్రేయస్‌కు లాభం
టీ20 బ్యాటర్ల జాబితాలో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను అందుకున్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు
టీ20 బౌలర్ల జాబితాలో భారత లెగ్ స్పిన్నర్ రవీ బిష్ణోయ్ 31 స్థానాలు మెరుగుపరుచుకుని 41వ స్థానానికి చేరుకున్నాడు. గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమైన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు కోల్పోయినా టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ ఆరు స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌కు చేరుకోగా, పేసర్ బ్లెస్సింగ్ ముజరబా 10 స్థానాలు మెరుగుపరుచుకుని 26వ స్థానంలో నిలిచాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు
పాకిస్థాన్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జస్టిన్ గ్రీవ్స్ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 21 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో తొమ్మిదో ర్యాంక్ సాధించాడు. వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్ 24వ స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 17వ స్థానానికి ఎగబాకాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధశతకం సాధించిన బాబర్ ఆజమ్ బ్యాటర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు.




















