అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

9 సెప్టెంబర్, 2026 11:46 AM•ByNarender Kumar Nangunoori

Share this article

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు, అక్కడ చేపట్టిన శుద్ధి కార్యక్రమం అంశాలపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

కేసీఆర్‌పై వ్యాఖ్యలపై చర్చకు బీఆర్ఎస్ పట్టు

కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టడంతో సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

20 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సమావేశాల మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులు ఉన్నారు.

శాసన మండలిలోనూ గందరగోళం

మరోవైపు తెలంగాణ శాసన మండలిలోనూ పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు మండలి చైర్మన్. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీంతో అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ రాజకీయ వేడి కొనసాగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు