హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల అంశం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా హరీశ్ రావుపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ గేటు వద్ద మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగిందని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు నులిమారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని పేర్కొన్నారు. దాడికి గురైన వారిపైనే తిరిగి కేసులు నమోదు చేశారని, తమకు న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన స్పీకర్.. దాడి ఘటనపై ఇప్పటికే నివేదిక కోరినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముందుగా తన తల్లిపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మాట్లాడాలని అన్నారు.
‘నా తల్లిని అన్నారు.. నాకు ఆగ్రహం ఉంటుంది. నీ తల్లిని అనలేదు. నీకెందుకు ఆగ్రహం’ అంటూ హరీశ్ రావును ఉద్దేశించి స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తనకు సోదరీమణులతో సమానమని స్పీకర్ తెలిపారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




















