వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. మీ సేవ కేంద్రాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్

ఇప్పటి వరకు ప్రభుత్వ సేవలకే పరిమితమైన మీ సేవ కేంద్రాలు ఇకపై చిన్న వ్యాపారాల డిజిటల్ ప్రచారానికీ వేదిక కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మెటా భాగస్వామ్యంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చుతూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు కూడా తక్కువ ఖర్చుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు ఇచ్చే అవకాశం పొందనున్నారు.

24 జులై, 2026 8:15 PM•ByGovardhan Reddy

Share this article

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన  తెలంగాణ ప్రభుత్వం.. మీ సేవ కేంద్రాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలు ఇకపై డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా కూడా సేవలందించనున్నాయి. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ–మీ సేవ), అంతర్జాతీయ టెక్ సంస్థ మెటా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో క్యూర్ (CURE) ప్రాంతానికి చెందిన 150 మందికి పైగా మీ సేవ విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (VLEలు) పాల్గొన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్ వంటి మెటా ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ ప్రకటనలు రూపొందించడం, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ సృష్టించడం, ప్రచార కంటెంట్ తయారు చేయడం, లక్ష్య వినియోగదారులను ఎంపిక చేయడం, డిజిటల్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు.

దీంతో ఇక కిరాణా దుకాణం నుంచి రెస్టారెంట్ వరకు, మెడికల్ షాపు నుంచి ఆసుపత్రి వరకు, పండ్ల వ్యాపారి నుంచి బ్యూటీ సెలూన్ వరకు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ నుంచి స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పెద్ద వ్యాపార సంస్థల వరకు ఎవరైనా తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి తక్కువ ఖర్చుతో ప్రొఫెషనల్ డిజిటల్ ప్రకటనలు రూపొందించి ప్రచారం చేసుకోవచ్చు.

మీ సేవ నిర్వాహకులు ప్రకటనల డిజైన్, ప్రచార కంటెంట్ తయారీ, సరైన టార్గెట్ ఆడియన్స్ ఎంపిక, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల ప్రచురణ, ప్రచార నిర్వహణ వంటి సేవల్లో పూర్తి సహాయం అందిస్తారు. దీంతో చిన్న వ్యాపారాలు కూడా పెద్ద సంస్థల తరహాలో డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే అవకాశం లభించనుంది.

మీ సేవ కమిషనర్ టి. రవికిరణ్ మాట్లాడుతూ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాంకేతికతను చిన్న వ్యాపారాల అభివృద్ధికి వినియోగిస్తోందన్నారు. మెటా డిజిటల్ అడ్వర్టైజింగ్ నైపుణ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్‌కు దూరంగా ఉన్న గ్రామీణ, చిన్న వ్యాపారులు కూడా నాణ్యమైన ప్రచార సేవలను పొందగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంతో మీ సేవ కేంద్రాల పాత్ర మరింత విస్తరించనుంది. పౌర సేవలతో పాటు డిజిటల్ మార్కెటింగ్ సేవలు కూడా అందించడం ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారాల వృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అదనపు ఆదాయ వనరు కూడా ఏర్పడనుంది. రాష్ట్రంలో డిజిటల్ ఎకానమీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం కీలక అడుగుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు