హైదరాబాద్, ఆగస్టు 29 (జనవాణి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (KK) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద 13 వేల మందికిపైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కళాకారులతో నిర్వహించిన సమావేశం వివరాలను కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. వారి అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ‘ఉద్యమకారుల వర్గీకరణ’ ముసాయిదా నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు
ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అప్లికేషన్ల స్వీకరణ కోసం వెంటనే అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ విధానంలో దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. జిల్లాల వారీగా సమన్వయం చేసుకుంటూ కమిటీకి అవసరమైన పరిపాలనా సహకారం, వనరులు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు
ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ పలు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ గుర్తింపు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెం. 679 ద్వారా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్నందుకు కేకే, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తదితరులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, వి.పి. గౌతమ్, ఎస్. శ్రీధర్ తదితర ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు పాల్గొన్నారు.




















