హైదరాబాద్, ఆగస్టు 11 (జనవాణి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. మరో 10 స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం విడుదల చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటివరకు 1,192 పోస్టుల ప్రక్రియ పూర్తి
అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాల్లోని 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మరో 500 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా ఇటీవల బోర్డు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
10 విభాగాల్లో మెరిట్ లిస్ట్
తాజాగా ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను MHSRB విడుదల చేసింది.
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నోటిఫై చేసిన ఖాళీలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఆగస్టు 13, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆగస్టు 13, 14 తేదీల్లో హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఏదైనా కారణంతో వెరిఫికేషన్‌కు హాజరుకాలేని అభ్యర్థులు, అలాగే పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అభ్యర్థుల కోసం ఆగస్టు 17ను రిజర్వ్ డేగా నిర్ణయించారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని బోర్డు సూచించింది. ఆధార్, జనన తేదీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ లేదా సమానమైన ధ్రువపత్రం, కమ్యూనిటీ/కుల ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు పూర్తి వివరాలను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.





















