ప్రభుత్వ ఆస్పత్రులకు మరో 500 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు.. ఫలితాలు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల కోసం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.

28 జులై, 2026 6:30 PM•ByLaharika

Share this article

ప్రభుత్వ ఆస్పత్రులకు మరో 500 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు.. ఫలితాలు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన స్పెషలిస్ట్ డాక్టర్ల నియామక ప్రక్రియలో మరో దశ పూర్తయింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల కోసం 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించింది.

ఈ నియామకాలలో జనరల్ సర్జరీ విభాగంలో 174, జనరల్ మెడిసిన్‌లో 166, ఆర్థోపెడిక్స్‌లో 89, రేడియాలజీలో 71 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి తుది ఫలితాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

1,616 పోస్టుల భర్తీ లక్ష్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం మొత్తం 24 విభాగాల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలకు చెందిన 692 పోస్టుల భర్తీ పూర్తయ్యింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, వారికి పోస్టింగ్‌లు కూడా కేటాయించారు.

1,192 పోస్టుల భర్తీ

తాజాగా విడుదల చేసిన 500 పోస్టుల ఫలితాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ పూర్తయిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మిగిలిన పోస్టుల నియామక ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఎంపికైన వారికి మంత్రి అభినందనలు

ఉద్యోగాలకు ఎంపికైన స్పెషలిస్ట్ డాక్టర్లందరికీ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలు అందించడంలో కొత్తగా ఎంపికైన వైద్యులు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు