బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. లాల్‌దర్వాజా, కార్వాన్‌, అంబర్‌పేట, చిలకలగూడలో మళ్లింపులు

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ బోనాలు, అంబర్‌పేట మహంకాళి ఆలయం, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

8 ఆగస్టు, 2026 6:45 PM•ByRalin

Share this article

బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. లాల్‌దర్వాజా, కార్వాన్‌, అంబర్‌పేట, చిలకలగూడలో మళ్లింపులు

హైదరాబాద్‌, ఆగస్టు 8(జనవాణి): బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ బోనాలు, అంబర్‌పేట మహంకాళి ఆలయం, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

లాల్‌దర్వాజా బోనాలు

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. ఇంజిన్‌ బౌలి, ఫలక్‌నుమా, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు, నాగుల్‌చింత, గౌలీపురా, కందికల్‌గేట్‌, ఛత్రినాక, ఫతేదర్వాజా, మొఘల్‌పురా, మీర్‌చౌక్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల నుంచి లాల్‌దర్వాజా వైపు వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు.

మదీనా ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఇంజిన్‌ బౌలి వరకు గుల్జార్‌హౌస్‌, చార్మినార్‌, చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌, హిమ్మత్‌పురా, నాగుల్‌చింత, ఆలియాబాద్‌ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని ఊరేగింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలకు మూసివేయనున్నారు.

భక్తుల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు

ఆలియాబాద్‌ వైపు నుంచి వచ్చే భక్తులు శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా దేవి ప్లైవుడ్‌ మెయిన్‌ రోడ్డుపై సింగిల్‌ లైన్‌లో లేదా అల్కా థియేటర్‌ ఖాళీ స్థలంలో వాహనాలు నిలపాలి. హరిబౌలి, గౌలీపురా వైపు నుంచి వచ్చే వారు ఆర్యవైశ్య మందిరం, అల్కా థియేటర్‌ ఖాళీ స్థలం, వీడీపీ స్కూల్‌ మైదానం, మిత్రా స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్కింగ్‌ చేసుకోవచ్చు.

ఛత్రినాక వైపు నుంచి వచ్చే భక్తులకు లక్ష్మీనగర్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, ఫూల్‌బాగ్‌ చమన్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చే వారు చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌లో వాహనాలు నిలపాలి. ఊరేగింపు వాహనాలకు ఢిల్లీగేట్‌ వద్ద సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

టీజీ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను చార్మినార్‌, ఫలక్‌నుమా, నయాపూల్‌ వైపు అనుమతించరు. వాటిని పాత సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్డు, ఛత్రినాక, ఇంజిన్‌ బౌలి వద్ద నిలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతారు.

కార్వాన్‌లో రాత్రి నుంచే మళ్లింపులు

దర్బార్‌ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో కార్వాన్‌లో ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లో ఉంటాయి. పురానాపూల్‌ జంక్షన్‌, టప్పాచబుత్రా, యాదవ్‌భవన్‌, ముర్గిచౌక్‌, తల్లాగడ్డ, మొఘల్‌కానాలా తదితర ప్రాంతాల నుంచి దర్బార్‌ మైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు.

కార్వాన్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మైదానం, తోలిమసీదు ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, జగత్‌సింగ్‌ ప్రైవేటు స్థలంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. జగత్‌సింగ్‌ స్థలాన్ని ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు.

అంబర్‌పేటలో ఇలా..

అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. ఉప్పల్‌ నుంచి చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌ వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలను అంబర్‌పేట ఫ్లైఓవర్‌ మీదుగా పంపిస్తారు. ఇదే విధంగా చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌ నుంచి వచ్చే వాహనాలనూ ఫ్లైఓవర్‌ మీదుగా మళ్లిస్తారు.

రామంతాపూర్‌ నుంచి ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ఎడమ బైలేన్‌ ద్వారా గాంధీ విగ్రహం వైపు వెళ్లి అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ మైదానంలో వాహనాలు పార్క్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌ రద్దీ పెరిగితే ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట టీ జంక్షన్‌, ఆలీకేఫ్‌ వైపు వచ్చే వాహనాలను రాయల్‌ జ్యూస్‌ కార్నర్‌, మల్లికార్జున్‌నగర్‌, డీడీ కాలనీ, శివంరోడ్డు, తిలక్‌నగర్‌ మీదుగా మళ్లించనున్నారు.

చిలకలగూడలోనూ మళ్లింపులు

శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలు చేస్తారు. సీతాఫల్‌మండి నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్డు వైపు వచ్చే వాహనాలను నామాలగుండు, వారసిగూడ ఎక్స్‌రోడ్డు, సీతాఫల్‌మండి టీ జంక్షన్‌, ఓయూ సిటీ రోడ్డు, తార్నాక ఎక్స్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. అల్లుగడ్డబావి, సికింద్రాబాద్‌ నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్డు మీదుగా సీతాఫల్‌మండి వైపు వెళ్లే వాహనాలను పద్మారావునగర్‌ టీ జంక్షన్‌ వైపు మళ్లించనున్నారు.

అత్యవసర సహాయం కోసం..

వాహనదారులు ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, ట్రాఫిక్‌ మళ్లింపులకు సహకరించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కోరారు. అత్యవసర సహాయం కోసం 9010203626 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తాజా ట్రాఫిక్‌ సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు