ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఈ కేసు నేపథ్యాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025వ బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. 2025 డిసెంబర్ నుంచి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనికి బాధితురాలు పరిచయం అయ్యింది. తన విజయ ప్రయాణంపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన పోస్టుకు ఆమె స్పందించడంతో వీరి పరిచయం మొదలైంది. తాను 2024 బ్యాచ్ ఏపీఎస్‌కు ఎంపికయ్యానని.. ఎక్స్‌ట్రాఆర్డినరీ లీవ్‌లో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు బాధితురాలు తెలిపింది. అలా మొదలైన వీరి స్నేహం పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ప్రేమగా మారింది.
అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఉదయ్ కృష్ణారెడ్డి పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బాధితురాలితో గొడవ సమయంలో ఆమె ల్యాప్‌టాప్‌ను విసిరేసి ధ్వంసం చేశాడు. ఈ పరిణామాలతో ఉదయ్ కృష్ణారెడ్డిని బాధితురాలు బ్లాక్ చేసింది. దీంతో రెచ్చిపోయిన ఉదయ్ కృష్ణారెడ్డి నకిలీ సోషల్‌మీడియా అకౌంట్లను సృష్టించాడు. అనంతరం తమ వ్యక్తిగత చాట్ బహిర్గతం చేస్తానని బెదిరించాడు. బాధితురాలి అనుమతి లేకుండానే ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను కాంటాక్ట్ అయ్యాడు. ఇలా రోజురోజుకూ వేధింపులు పెరగడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని ఆమె దూరం పెట్టింది. పెద్దల సూచన మేరకు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లయినా ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు మాత్రం ఆగలేదు.
వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని.. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నిందితుడిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




















