తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కొత్త విషయం కాదన్నారు. గత 12 ఏళ్లుగా ప్రతి GRMB సమావేశంలో ఇదే అంశాలను ప్రస్తావిస్తూ వస్తోందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాం
ఏపీ అభ్యంతరాలను ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టి సీతమ్మ సాగర్–సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2025 ఏప్రిల్ 24న టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) అనుమతులు సాధించిందని మంత్రి తెలిపారు.
బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సాధించలేని అనుమతులను తమ ప్రభుత్వం సాధించిందన్నారు. అలాగే 60 టీఎంసీల నీటి కేటాయింపులు కూడా తీసుకువచ్చామని పేర్కొన్నారు.
సమ్మక్క సాగర్‌కు నెలాఖరులో ఎన్వోసీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు సమస్యపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలిసి నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వాలని కోరారని చెప్పారు. నెలాఖరులోగా ఎన్వోసీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కసారి అయినా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలిశారా అని హరీశ్ రావును ప్రశ్నించారు.
ట్రిబ్యునల్ ఏర్పాటును అడ్డుకున్నాం
ఆంధ్రప్రదేశ్ కోరిన విధంగా నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు కాకుండా తమ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో సమయోచితంగా వ్యవహరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కేంద్ర జలశక్తి శాఖతో నిరంతర సంప్రదింపులు జరిపి ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయగలిగామని పేర్కొన్నారు.
బనకచర్ల అంశంపై వెంటనే స్పందించాం
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రెండు సార్లు, తాను ఏడు సార్లు, ప్రధాన కార్యదర్శి పది సార్లు, ఇంజినీరింగ్ అధికారులు పలుమార్లు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (CWC), GRMB, KRMB తదితర సంస్థలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణ వాదనను బలంగా వినిపించారని చెప్పారు.
సుప్రీంకోర్టులోనూ పోరాటం
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు మంత్రి వెల్లడించారు.
ఒరిజినల్ సూట్‌తో పాటు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశామని, నాలుగు వారాల్లోగా ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు.
బీఆర్‌ఎస్‌పై వరుస ప్రశ్నలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు బీఆర్‌ఎస్ పాలనలోనే జరిగాయని మంత్రి గుర్తు చేశారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అలాగే ఆర్డీఎస్ ఆధునీకరణ, కృష్ణా జలాల వాటా, కర్ణాటకతో చర్చలు, ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు.
కాళేశ్వరం ముడుపులపై సమాధానం చెప్పాలి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందుకున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు హరీశ్ రావు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఆ ముడుపుల్లో తన వాటా ఎంత అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే లక్ష్యం
రాష్ట్ర ప్రజల నీటి హక్కులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదని, రాజకీయ విమర్శల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.




















