ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 8 (జనవాణి): సోషల్ మీడియా రీల్స్‌కు బానిసైన ఓ మహిళ.. ఇంటర్నెట్ సమస్య కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా జిల్లా కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారధి ప్రతిరోజూ గంటల తరబడి మొబైల్‌లో రీల్స్ చూసేది. శనివారం రీల్స్ చూస్తుండగా ఆమె మొబైల్‌లో ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. దీంతో వీడియోలు పదేపదే బఫరింగ్ కావడంతో సారధి తీవ్ర అసహనానికి గురైంది. కోపంతో మొబైల్ ఫోన్‌ను విసిరికొట్టిన ఆమె.. అనంతరం పురుగుల మందు తాగింది.
ఈ విషయాన్ని గమనించిన ఆమె కుమార్తె కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వెంటనే సారధిని కర్తాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కోర్బా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సారధి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.




















