హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న సామాజిక సేవకుడు కోటగిరి నవీన్‌కుమార్‌ను సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నవీన్‌కుమార్‌కు శాలువా కప్పి సత్కరించారు. బహ్రెయిన్‌లో కష్టాల్లో ఉన్న తెలంగాణ వలస కార్మికులు, ప్రవాస భారతీయులకు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా బహ్రెయిన్‌లో ఆపదలో ఉన్న తెలంగాణ వాసులకు అండగా నిలుస్తూ అందిస్తున్న సేవలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని చిన్నారెడ్డి, విద్యాసాగర్ ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన కోటగిరి నవీన్‌కుమార్ ప్రస్తుతం బహ్రెయిన్‌లో నివసిస్తూ, అక్కడి తెలంగాణ ప్రవాసులకు వివిధ సమస్యల పరిష్కారంలో సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి పాల్గొన్నారు.





















