ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. బోనాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు సాధారణ దర్శనానికి మూడు క్యూ లైన్లు, బోనాల సమర్పణ కోసం రెండు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంచారు.




















