ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే వారి ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండేది. కానీ త్వరలో ఆ పరిస్థితి మారబోతోంది. వాట్సాప్.. యూజర్‌నేమ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో ప్రతి యూజర్ తనకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంచుకుని, అదే ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వొచ్చు.
అంటే.. ఇక మీ మొబైల్ నంబర్‌ను తెలియకుండా కూడా కొత్త వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. అయితే అందుకు మీ యూజర్‌నేమ్ వారికి తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
వాట్సాప్ తెలిపిన వివరాల ప్రకారం.. యూజర్‌నేమ్ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి. ఒకే యూజర్‌నేమ్‌ను ఇద్దరు ఉపయోగించే అవకాశం ఉండదు. ప్రముఖులు, సంస్థలకు సంబంధించిన కొన్ని పేర్లను కంపెనీ ముందుగానే రిజర్వ్ చేయనుంది.
అంతేకాదు.. భద్రతను మరింత పెంచేందుకు 'యూజర్‌నేమ్ కీ' అనే అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. అంటే మీ యూజర్‌నేమ్ తెలిసినా.. యూజర్‌నేమ్ కీ లేకుండా కొత్త వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదించలేరు. దీంతో స్పామ్ మెసేజ్‌లు, అనవసర చాట్‌లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్లాక్, సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ వంటి ప్రైవసీ ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీకు ఈ అప్‌డేట్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే.. WhatsApp Settings → Profile లోకి వెళ్లి Username అనే ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఆప్షన్ కనిపించకపోతే.. రాబోయే రోజుల్లో దశలవారీగా మీ అకౌంట్‌కు కూడా ఈ అప్‌డేట్ అందే అవకాశం ఉంది.
మీకు ఈ కొత్త WhatsApp Username ఫీచర్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.




















