ప్రకాశం, జూలై 22: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా కందుకూరు రూరల్ పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ శివారులోని పొలాల్లో పేకాట జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై బాలకృష్ణ నేతృత్వంలోని పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1,02,000 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 10 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. పేకాట, కోడి పందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్-112 లేదా పోలీసుల వాట్సాప్ నంబర్ 9121102266 కు సమాచారం అందించాలని కోరారు.




















